21, జులై 2011, గురువారం

నహ్..రా.....యణ ...నహ్..రా.....యణ ..!


సంస్కారవంతమైన విద్యావిధానాన్ని పక్కా వాణిజ్య పంధాలో కి ....నెమ్మదిగా...మాఫియా స్థాయిలోను నడిపీ....కొన్ని ’విధ్యాసంస్థలు’ అనబడే కంపెనీలు కోట్లు కొల్లగొడుతున్నాయి. విద్యార్థులను ’హరినారాయణులు’గానూ, ’చైతన్యవంతులు’గానూ తీర్చిదిద్దుతామని నమ్మబల్కి ఆనక వారి గార్డియన్ల జేబులకి చిల్లులూ-పిల్లల భవిష్యత్తుకు తూట్లూ పొడుస్తున్నాయి. ఫలితాలు వెలువడ్డం తరువాయి యెడా పెడా ప్రింట్ అన్డ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో సోకాల్డ్ విజయాల్ని చాటుకుంటే...అయినా వీరి వాణిజ్య గోలలకి పడిపోక...అసలు పట్టించుకోని  జనాలని చూసి...అయోమయంలో పడి....చివరకు ’వాణిజ్య ప్రకటన’ పేరుతో ’ఆదివారం అనుబంధాల్లో’ సెంటర్ స్ప్రెడ్ వార్తాకధనాలు రాయించుకునే దుస్థితిలో ఉన్నాయా కార్పొరేట్లు!!
ఈ వాజమ్మలంతా.....ఇంద్రుడూ, చంద్రుడూ, మహామనీషి,విద్యావేత్త, మార్గదర్శి...లాంటి చమక్కులతో  వాణిజ్యవార్తలు రాయించుకుంటున్నారు. ఇలాటివన్నీ గొబెల్స్ ప్రచారాలై...జనరేషన్ల తర్వాత నిజాలై కూర్చుంటాయి. అందుకే ఈ నాలుగు ముక్కలూ రాస్తున్నాను. నిజానికి వీళ్ళ ధ్యేయం కోట్ల ఆర్జన తప్ప....విద్యాదానమూ-మట్టీ ఏం కాదు. కూలి నాలీ చెసుకునే వాడు కూడా చక్కగా చదువుకునే పాఠశాలలకు స్థానం లేకుండా - చదువు"కొనే’ స్థాయులకు తీసుకు వెళ్ళిన వాణిజ్య బకాసురుల చేతిలో సరస్వతీమాత విలవిల లాడుతోంది. విద్య ’అంగడి సరకు’గా ఎప్పుడో మారింది. పది రూపాయలకు దొరికే తెలుగు అకాడమీ పుస్తకాలు కాపీలు చేసుకుని కొత్త అట్టలు వేసుకుని వేలాది రూపాయలకు మళ్ళీ కార్పొ’రేట్’ విద్యార్ధులకే  అమ్మి కోట్లు గడించిన వైనం ఆ మధ్య మీడియాలో దుమారం లేపింది. మళ్ళీ ’వాణిజ్య’సూత్రాలననుసరించి....ఆ ’కాపీల’ వెనుక ’కూపీలు’ లాగలేక పోయింది ప్రభుత. అక్రమార్కానికి మార్కులువేసి .....వాతాపి జీర్ణం....అనిపించుకుంది. "మాఫియా" అని అందుకే అనాల్సొస్తుంది బాధతో!!
అసలు ఈ డబ్బా కాలేజీలు విద్యావికాసానికి చేసే మేళ్ళు శూన్యం! ఆల్రెడి టాలెంటెడ్ విద్యార్ధులను నయానో భయానో ’కొని’ వాడి టాలెంట్ కు పేటెంట్ మేమే అని చెప్పుకోవడమే వీళ్ళ నిర్వాకం. అక్కడాగితే పర్లేదు. ఓ మోస్తరు విద్యార్ధులను కూడా అసలు పట్టించుకో పోగా....భారీ పీజులతో గుంజీలు తీయించడం అమానుషం.  ఆమధ్య ఓ విద్యార్ధినిని వీళ్ళ గురించి అడిగితే ఇలా అంది. "ఇందులో చేరిన వాళ్ళు - రిచ్ బికం రిచ్...పూర్ బికం పూర్!!!"   పిల్లలకీ-రిచ్నెస్కీ సంబంధం ఉందిగానీ ఈ అమ్మాయి కోట్ అంతగా అర్ధం కాలేదు. అదే అడిగాను ఆ కోట్ మీనింగేంటని. "ఇంకా డైరెక్ట్‌గా ఏంచెప్పాలి ఆంటీ...రిచ్ టాలెంట్ కనిపిస్తే లాక్కుని హాస్టల్లో పెట్టి, ఫుడ్డు పెట్టి, పీజు కట్టి....ఓ నలుగురు లెక్చరర్లు వాణ్ణి పట్టుకుని తలంటి పోసి రుబ్బి “ఙ్యాన సముపార్జన" చేయించి ఐఐటీ వీరుణ్ణి చేసి చూపిస్తారు. ఈ పూడిక ..... మిగిలినోళ్ళదగ్గర్నుంచి లక్షలు లక్షలు వసూలు చేసి ....... సబ్జెక్ట్‌లో చిన్నపాటి సందేహాన్నికూడా నివృత్తి చేయరు. చివరికి వాడు ’మాణిక్యం’ అవుతే - వీడు ’మట్టి’ అవుతాడు ! వేరేచోట చదువుతే కనీసం ’మట్టి’ గానీ ’సినిక్’గానీ అవడు కదా.... అదీ నా కోట్ కి అర్ధం " అని చెప్పి ఉస్సురంది.
26.5.11 ఈనాడులోని వార్త ప్రకారం...కేవలం ఐ ఐ టీ కోసం - ఒక్కో విద్యార్ధికీ సగటున రెండేళ్ళ శిక్షణకు కనీసం రూ.40,000 చొప్పున దేశవ్యాప్తంగా 1600 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనాట.  రెండేళ్ళ బదులు ’ఏడేళ్ళూ’ (సోకాల్డ్ ఇంటెగ్రేటెడ్ కోర్స్), ఏడాదికి ’లక్ష’ చొప్పున చూసుకుంటే......ఈ వ్యాపారం రూ.56,000 కోట్లకు చేరుతుంది. త్వరలో ’లక్షకోట్లకు’ చేరినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఇలా కోట్లు కొల్లగొట్టి  విద్యని మాఫియా చేసిన ’మార్గదర్శులని’ సరస్వతి మాఫీ చేయదుగాక చేయదు. "వీళ్ళకా అవార్డులిచ్చేది...నడ్డివిరగ్గొట్టక..." అని నిలదీస్తున్నారు పేరంట్స్ అసోసియేషన్స్.  అయినా ఈ మార్కెట్లో ప్రశ్నించిన పేరెంట్‌దే నడ్డివిరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఉదాసీనతకు గురి కాబడుతున్నారు. మార్గదర్శులు మాత్రం కోట్ల ధనరాశులమీద కూర్చుని రెండు వేళ్ళెగరేసి విజయచిహ్నాల్ని చూపుతున్నారు. ప్రభుత కొంగ జపం చేస్తోంది.
వంద రూపాయల ఫీజుతో మేం చదువుకున్న రోజుల్లో- నడిచో,స్కూలు రిక్షాలోనో వెళ్ళీ - ఎకరాల స్థలాల్లో ఉన్న స్కూళ్ళల్లో చదివేవాళ్ళం. మాకు 9వ తరగతిలోనే ల్యాబ్‌లో ’పిప్పెట్టు’ ’బ్యూరెట్టు’ లాటివి చూపేవారు. ఇప్పుడీ డభ్భా కార్పొ’రేట్స్’లో....ఇంటర్ రెండో సంవత్సరంలో కూడా....పొటెన్షియో మీటర్,గాల్వనోమీటర్ కనీసం ఆమ్మీటర్ లాటివి కూడా చూపుకు నోచుకోలేక పోతున్నారు విధ్యార్ధులు ఆ ఇరుకు గదుల్లో!!  క్రీడల విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. ’విద్యావేత్తలనబడే’ వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాల్సిన సందర్భం ఇది. వీళ్ళని గుడ్డలిప్పదీయకపోగా....దయచేసి రత్నాలనీ....మార్గదర్శులనీ....పెయింట్ వేయకుండా ఉందామా?

1 కామెంట్‌:

శరత్ కాలమ్ చెప్పారు...

మీరు చెప్పినదంతా నిజమే. పాపం చదువుకు(కొ)నే పిల్లలు.